విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన చీఫ్ విప్ జీవీ, లీలావతి దంపతులు.

 రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరవాలి.

వినుకొండలో ముగిసిన అండర్ –19 అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు.

విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన చీఫ్ విప్ జీవీ, లీలావతి దంపతులు.

వినుకొండ నవంబర్ 17(అక్షరకృష్ణ ):అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులంతా భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని, ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున స్వర్ణ పతకాలు సాధించే దాంట్లో వారంతా ముందుండాలన్నతే తన ఆకాంక్ష అన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు జరిగిన అండర్ –19 అంతర్ జిల్లాల బాలబాలికల కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. పోటీల ముగింపు వేడుకకు వినుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలు, రన్నరప్ జట్లను సత్కరించి, ట్రోఫీలు, మెడల్స్, ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు ప్రేక్షకులతో పాటు గ్యాలరీలో కూర్చుని జీవీ దంపతులు ఫైనల్ మ్యాచ్‌లను ఆసక్తిగా వీక్షించారు. ఫైనల్లో బాలుర విభాగంలో విజేతగా నిలిచిన గుంటూరు జట్టుతో పాటు రన్నరప్‌ వైఎస్సార్ కడప జట్టు.. బాలికల విభాగంలో విజేతగా నిలిచిన అనంతపురం జట్టుతో పాటు రన్నరప్‌గా నిలిచిన నెల్లూరు జట్టుకు కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాల్గొన్న ప్రతి జట్టూ క్రీడాస్ఫూర్తి, పట్టుదలతో పోరాడటం అభినందనీయమన్నారు. కోరిన వెంటనే ఈ పోటీలను వినుకొండకు కేటాయించిన విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్రా అని చెప్పారు తప్పితే కనీసం ఆడుకోవడానికి ఒక వాలీబాల్ లేదు, బ్యాడ్మింటన్ బ్యాట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బ్యాట్ ఇవ్వకుండా ఆడుదాం, పాడదామన్నారని మండిపడ్డారు. ఒక్కో పాఠశాలకు రూ.30 వేల విలువైన క్రీడా కిట్‌ను మంత్రి నారా లోకేష్ అందజేస్తున్నారని తెలిపారు. సమగ్ర ప్రణాళికతో పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులనూ ఆయన అభినందించారు.డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.