తెలుగు సాహిత్యానికే వన్నెతెచ్చిన మహాకవి గుర్రం జాషువా - కన్నా నాగరాజు


  సత్తెనపల్లి : బెంజ్ న్యూస్ 


సత్తెనపల్లి పట్టణంలో

విశ్వనరుడు గుర్రం జాషువా 53వ వర్ధంతిని  కవికోకిల శ్రీ గుర్రం జాషువా సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ  కార్యక్రమానికి  సంస్థ అధ్యక్షులు యిర్మీయా  అధ్యక్షత వహించారు. గుంటూరు నగర మాజీ మేయర్ కన్న నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  ముందుగా స్టేషన్ రోడ్లో గల గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  మాజీ మేయర్ నాగరాజు మాట్లాడుతూ గుర్రం జాషువా తన సాహిత్యం ద్వారా జన సామాన్యానికి చాలా దగ్గరగా చేరువైన మహాకవి అన్నారు. ఆనాడు తన తల్లి ద్వారా అస్పృశ్యత,  అంటరానితనంలోని  నీచత్వపు స్థితిని, సామాజిక,  ఆర్థిక మానసిక, భౌతిక, తాత్విక, మానసిక రంగాలలో నిమ్న జాతులను అణగద్రొక్కే అగ్రజాతుల వారి కుతంత్రాలను తెలుసుకొని, స్వయంగా అనుభవించి,  తన జీవితాంతం సాహిత్యం ద్వారా ఆ చీడ పీడనల విముక్తికై అవిశ్రాంత సాహితీ యుద్ధం చేసిన కవి ధీరుడు జాషువా అని కొనియాడారు. జాషువా తన జీవితకాలంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికిని అంతకు మించిన బిరుదులను, పురస్కారాలను అందుకున్న గొప్ప కవి జాషువా అని తెలిపారు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి చేత తన కాలికి గండపెండేరం తొడిగించుకున్న  కవి జాషువా అన్నారు.

సత్తెనపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలినేడి రామస్వామి మాట్లాడుతూ వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో  జాషువా పద్యాలు చదివి వినిపించినప్పుడు తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ ఆయనను కొంతమంది ఎంతో అవహేళన చేశారని తెలిపారు. తన కలాన్ని ఖడ్గంగా మార్చుకొని  అంటరానితనంపై, మూఢాచారాలపై,  స్త్రీ వివక్షత పై అనేక రచనలు చేసి జాషువా విశ్వ నరుడుగా ఖ్యాతి చెందాడని తెలిపారు.  యిర్మీయా మాట్లాడుతూ జాషువా వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేస్తున్నామని మెట్లు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అందుకు సహకరించాలని నాగరాజు గారిని కోరారు. ఈ కార్యక్రమంలో  సంస్థ ఉపాధ్యక్షులు ఏఎన్ఆర్ జక్కం, కార్యదర్శి జి. సురేష్ బాబు, జాయింట్ సెక్రెటరీ జాన్ బాబు, కూచిపూడి కోటేశ్వరరావు, కృపారావు,  గుర్రం అనిల్, చౌటా శ్రీనివాసరావు, తోట అంబిక, జయ కుమార్,  ప్రేమ్ కుమార్, కోమటినేని శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు మాతంగి సాంబశివరావు,  కటకం రామకృష్ణ, స్టాన్లీ,  ఎల్ రవి, స్కైలాబ్,  బలిజేపల్లి సురేష్, పెద్దింటి నాగేశ్వరరావు, బంకా కిషోర్ బాబు, కృపావరం, ఆనంద్, రమాదేవి, నిరంజన్, శ్యామ్, అనంత కుమార్, బండారు నాగరాజు,  జానకిరామయ్య, పెద్దింటి వెంకటేశ్వర్లు, జానీబాష, యాక్టర్ చెన్నకేశవులు, చిలుక రమణయ్య, జాషువా అభిమానులు,  తెలుగు భాషా ప్రియులు తదితరులు పాల్గొన్నారు.