కొండవీడు కోట పర్యాటక అభివృద్ధికి చర్యలు: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

 నరసరావు పేట, అక్టోబరు 16(అక్షరకృష్ణ):

రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న చక్కని పర్యాటక ప్రాంతం కొండవీడు కోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. కోట అభివృద్ధికి అటవీ శాఖ, పర్యాటక శాఖల నుంచి అనుమతులు, నిధులు కోరుతున్నామని, పరిశ్రమల సీఎస్సార్ నిధులను ఉపయోగించుకునే అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు.. గురువారం ఉదయం కొండవీడు కోటను జిల్లా కలెక్టర్ సందర్శించారు. కోటకు చేరుకునే ఘాటు రోడ్డు అద్భుతంగా ఉందని, ఘాటు రోడ్డును ప్రధాన రహదారులతో కలిపే రోడ్డు మార్గం మరమ్మతులను త్వరలోనే పూర్తి చేయనున్నామన్నారు. కాయకింగ్, ట్రెక్కింగ్, బోటింగ్ కోసం వస్తున్న పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. వీటితో పాటూ నైట్ క్యాంపింగ్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. కొండవీడు అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి విలువైన సూచనలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీవో మధులత తదితరులు పాల్గొన్నారు.