కాటేసిన పాముతోనే ఆసుప‌త్రికి.. ఎంత చెప్పిన విన‌కుండా వ్య‌క్తి వింత ప్ర‌వ‌ర్త‌న‌.. వైద్యులు షాక్‌

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఘ‌ట‌న‌ ప్రకాశ్‌ మండల్ అనే వ్యక్తిని కాటేసిన రస్సెల్స్ వైపర్ ఆ విషసర్పాన్ని నోటితో క‌రిచిపట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన బాధితుడు వైద్యులు ఎంత చెప్పిన విన‌ని వైనం ఓ వ్య‌క్తి త‌న‌ను కాటేసిన పాముతోనే ఆసుప‌త్రికి చికిత్స కోసం వెళ్ల‌డం చూసి అంద‌రూ షాక్ అయ్యారు. ఆ వ్య‌క్తికి వైద్యులు ఎంత చెప్పిన ఆ పామును వ‌దిలిపెట్ట‌లేదు. దాంతో చేసేదేమిలేక వైద్యులు అలాగే చికిత్స అందించారు. వివ‌రాల్లోకి వెళితే... ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఓ వ్యక్తిని కాటు వేసింది. ప్రకాశ్‌ మండల్ అనే వ్యక్తి ఇలా ఆ విషసర్పాన్ని నోటితో పట్టుకుని మెడకు చుట్టుకుని ఆస్పత్రికి వెళ్ల‌డం చూసి అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. కాటుకు గురై ఎమర్జెన్సీ వార్డులో అత్యవసరంగా చికిత్స అందించాలని కోరుతూ పాముతో ఉన్న అత‌డిని చూసి వైద్యులు, అక్క‌డ ఉన్న‌ రోగులు షాక్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌తో కొద్దిసేపు ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పామును వ‌దిలిపెట్టాల‌ని వైద్యులు, అక్క‌డ ఉన్న‌వారు ప్రకాశ్‌ మండల్ కోరారు. అయినా అత‌డు ఆ స‌ర్పాన్ని విడిచిపెట్టేందుకు స‌సేమీరా అన్నాడు. అలాగే త‌న‌కు చికిత్స అందించాల‌ని కోరాడు. అది త‌నతోనే ఉండాల‌ని చెప్పాడు. చివ‌రికి అతను నేలపై పడుకున్న కూడా తన కుడి చేతితో ఆ విష‌స‌ర్పాన్ని అలాగే గట్టిగా పట్టుకోవ‌డం క‌నిపించింది. పాముతోనే ప్రకాశ్ స్ట్రెచర్‌పై వెళ్లాడు. అయితే, పామును అలా చేతిలో పట్టుకుని ఉంటే వైద్యం చేయడం కష్టమని డాక్టర్ న‌చ్చ‌జెప్పారు. దాంతో చివరకు పామును విడిచిపెట్టాడు. ప్ర‌స్తుతం ప్ర‌కాశ్ ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతున్నాడు. రస్సెల్స్ వైపర్ అనేది వైపెరిడే ఫ్యామిలీకి చెందిన అత్యంత విషపూరితమైన పాము. ఇది ఇండియా, తైవాన్, జావాల‌లో త‌ర‌చూగా క‌నిపిస్తుంది. ఎక్కువగా వ్యవసాయ భూముల్లో ఉంటుంది.