బీసీ హాస్టల్లో ఫ్యాన్లు నిల్,దోమలు ఫుల్ అపరిశుభ్ర వాతావరణం లో హాస్టల్ విద్యార్థులు

 


సత్తెనపల్లి : బెంజ్ న్యూస్ 


రాజుపాలెం : నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కమిటీ కార్యవర్గ సభ్యులు పల్నాడు జిల్లా రాజుపాలెం మండలకేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా వసతి గృహంలో పలు సమస్యలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వసతి గృహంలో వర్షం వస్తే రూములు కారడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా బిల్డింగ్ లీకులు వల్ల నీళ్లు వసతి గృహంలో పడటంవల్ల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వసతి గృహం లోని బాత్రూమ్స్, మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతూ అద్వానంగా ఉన్నాయి. బాత్రూం డోర్స్ విరిగిపోయి ఉన్నాయి.రూములలో ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు విద్యార్థులు నిద్రించటం చాలా ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. వసతి గృహంలో చాలా రూములలో ఫ్యాన్లు లేవు, విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు కొంత కాలం నుండి రావడంలేదని విద్యార్థులు కార్యవర్గ సభ్యులకు తెలియజేయడం జరిగింది. బాత్రూమ్స్ ప్రక్కన గడ్డిపెరిగి ఉండడంవల్ల దోమలు ఈగలు ఎక్కువగా వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. వసతి గృహం బిల్డింగ్ వర్షపు కారడం వల్ల శిథిల వ్యవస్థకు చేరుకున్నది. పై కప్పు అక్కడక్కడ పెచ్చులు ఊడి ఉండటం కమిటీ సభ్యులు గమనించారు.గత కొన్ని సంవత్సరాలుగా వసతి గృహానికి సున్నం, పెయింటింగ్ వేయకపోవడం వల్ల గోడలు పాడై ఉన్నాయి.కొన్ని ఏళ్ళుగా బిల్డింగు రిపేర్లు చేసినట్టు కనపడటం లేదు,బాలుర వసతి గృహం అని పేరు ఉన్న బోర్డు కూడా కనిపించడం లేదు, వసతి గృహ వాతావరణం అపరిశుభ్రంగా ఉండటం కమిటీ సభ్యులు గమనించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడు గరికిపాటి శంకర్రావు, ఉపాధ్యక్షుడు కోటిరెక్క కుమార్, సంయుక్త కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు, కోశాధికారి, మీడియా కోఆర్డినేటర్ కోట బాబురావు తదితరులు పాల్గొన్నారు.