సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా అందరూ మెచ్చే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది. సామాన్యులకు 'టమాటా' చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 పలుకుతుండటంతో చాలా మంది టమాటాకు టాటా చెబుతున్నారు. హైదరాబాద్లో రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని.. ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, మచ్చలున్న, మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని వాపోతున్నారు. ఇక బహిరంగ మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయాలు సాగిస్తుండటంతో చాలా మంది మధ్యతరగతి వినియోగదారులు అసలు టమాటాల వైపే చూడటం లేదు. ప్రతిరోజూ నగరంలో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికందక ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లే వస్తోంది. దీంతో డిమాండ్‌ పెరిగి ధర కొండెక్కిందని వ్యాపారులు అంటున్నారు. సెప్టెంబరు వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశముందని చెబుతున్నారు.


 రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. ఫార్మెటివ్-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనుండగా..ఫార్మెటివ్-2 పరీక్షలు సెప్టెంబరు 26-30 వరకు ఉంటాయి. సమ్మెటివ్-1 పరీక్షలు నవంబరు 1-15, ఫార్మెటివ్-3 వచ్చే జనవరి 2- 6 వరకు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 10-20 వరకు ఉంటాయి.ఫార్మెటివ్-4 పరీక్షలు మార్చి 3-6, సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 7-18 వరకు నిర్వహిస్తారు.సెలవులు: దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13వరకు ఉంటాయి. క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.


క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఇవ్వనున్నారు.