ఒంగోలు అక్టోబర్ 16(అక్షరకృష్ణ):పుట్టినటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, ఆ గ్రామం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యం, లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగిన 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజం ఉన్నప్పుడే ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నపుడే ఆ కుటుంబం, ఆ గ్రామం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యం, లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ స్థాయి నుండి అంగన్వాడీ వ్యవస్థ ను తీసుకురావడం జరిగిందన్నారు. దేశం యొక్క సంపద, అభివృద్ధి ఆ దేశంలోని మానవాళి అభివృద్ధి పై ఆధారపడి ఉంటుందన్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే, ఆ నలుగురు పిల్లలు అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం ఆర్ధికంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. దేశ పరిస్థితి కూడా అదేనని, ఆ పరిస్థితి ఉండరాదన్న ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకువెళ్ళి అమలు చేయాల్సిన భాద్యత మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పోష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యకరమైన సమాజంతోనే దేశాభివృద్ది ముడిపడి ఉందన్నారు. ఆరోగ్యకరమైన, పౌష్టికాహార లోపం లేని పిల్లలను సమాజానికి అందించాల్సిన బాధ్యత ఐసిడిఎస్ సిబ్బంది పై వుందన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రజలు ఏ ప్రాంతంలో ఉంటారో వాళ్ళు నాలెడ్జి పరంగా, శక్తి పరంగా ఏదోఒక రకంగా దేశ అభివృద్ధి లో భాగస్వాములు అవడంతో ఆదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాదిస్తుందన్నారు. 6 సంవత్సరాల లోపు పిల్లలకు సరైన బలవర్ధకమైన ఆహారం, పోషకాలు సమపాళ్ళలో పౌష్టికాహారం అందినప్పుడే వాళ్ళ బ్రెయిన్ వృద్ది చెంది దాని ప్రభావం వారి జీవితం పై పడి వారు ఆరోగ్య పరంగా, శక్తి పరంగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పౌష్టికాహార మరియు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ గర్భవతులు, బాలింతలు ఆరోగ్యమైన జీవనం సాగించాలన్నారు. అలాగే బిడ్డ పుట్టిన మొదటి రోజు నుండి మంచి పౌష్టకాహారం తీసుకుంటూ, వైద్యుల సలహాలు సూచనలు తప్పక పాటిస్తూ ఆరోగ్యమైన బిడ్డలను సమాజానికి అందించాల్సిన భాధ్యత ప్రతి తల్లి పై ఉందన్నారు. నేను అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళాలి అని ఉత్సాహం, భావనను పిల్లల్లో పెంపొందేలా వాళ్ళు ఇష్టంగా తినగలిగేలా పౌష్టికాహారం అందిచాల్సిన భాద్యత అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది పై ఉందని, ఈ విధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్, ఐసిడిఎస్ సిబ్బందికి సూచించారు. వీలైనంతవరకు పిల్లల తల్లిదండ్రులను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి సువర్ణ, మెప్మా పిడి శ్రీ శ్రీహరి, ఆర్బిఎస్కె ప్రోగ్రాం ఆఫీసర్ డా. భాగీదర, విజయ చారిటబుల్ ఫౌండేషన్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డా. రవీంద్ర కుమార్ తదితరులు ప్రసంగిస్తూ, రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల ఉద్దేశ్యంను, పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను తెలియచేసారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలు జనరల్ నాలెడ్జి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, రైమ్స్ పాడటాన్ని జిల్లా కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం పై అవగాహన కల్పించడంలో భాగంగా రూపొందించిన పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. విశేష కృషి చేసిన 9 మంది సూపర్వైజర్ల కు జిల్లా కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన అన్నప్రాసన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రదం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులు, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.