అధిక మోతాదులో ఎరువుల వాడకంను నియంత్రించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్

 

బాపట్ల అక్టోబర్ 21(అక్షర కృష్ణ): అధిక మోతాదులో ఎరువుల వాడకంను నియంత్రించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులకు సూచించారు.మంగళవారం, స్థానిక కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో మరియు ఆహార భద్రతను నిర్ధారించడంలో ఎరువులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. ఎరువులు పంటల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మరియు ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని ఆయన తెలిపారు. ఎరువులు నిత్యవసర వస్తువుల చట్టం నియంత్రణ పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం ఎరువులపై భారీ సబ్సిడీ అందిస్తుందని, గత కొన్ని సంవత్సరాలుగా యూరియా మరియు డిఏపి వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. ఎరువులను ఎక్కువగా వాడడంలో రైతులకు సరైన అవగాహన లేకపోవడమేనని ఆయన అన్నారు. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం " ధర్తి మాతా బచావో అభియాన్ "(భూమాత రక్షణ కమిటీ) కార్యక్రమం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి కమిటీలను నియమించినట్లు ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో రభి మరియు ఖరీఫ్ సీజన్లకు ముందు సాయిల్ హెల్త్ కార్డు సిఫార్సుల ఆధారంగా సమతుల్య ఎరువుల వాడకానికి సంబంధించి గ్రామ పంచాయితీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అధిక రసాయన ఎరువులు వినియోగించే ప్రదేశాలను గుర్తించి వారికి అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. రైతులు తమ పొలాల నేల పరిస్థితులను మెరుగుపరచడానికి రసాయన ఎరువులను వివేకవంతంగా ఉపయోగించమని ప్రోత్సహించడం, రైతులకు పంపిణీ చేయబడిన నేల ఆరోగ్య కార్డు నేలలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు. జిల్లా అంతట ఎరువుల వాడకాన్ని పరిశీలించి సమతుల్య వినియోగం కోసం ప్రత్యేక ప్రచారాలను చేపట్టాలన్నారు. అధిక ఎరువుల వినియోగ ప్రాంతాలను గుర్తించి కృషి విజ్ఞాన శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కోసం గ్రామపంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఎరువుల నిల్వ స్థితిని పరిశీలించి మిగిలును లోటు ప్రాంతాలకు సిఫార్సు చేయాలని ఆయన అన్నారు. రసాయన ఎరువులను వివేకవంతంగా వాడటం వల్ల సాగు ఖర్చు తగ్గుతుందని,అధిక ఉత్పాదకత సాధించడం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. ఎంత విస్తీర్ణానికి ఎంత మోతాదులో యూరియా వాడాలి, ఈ విషయమై వ్యవసాయ అధికారులు ప్రజలతో మమేకమై వారికి అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. భూ పరీక్షలను నాణ్యతతో చేయాలని ఆయన అన్నారు. యూరియా మోతాదు ఎక్కువ వాడటం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. రైతులకు ఎంత యూరియా కావాలో ముందుగా రైతుల వద్ద నుండి సమాచారం సేకరించాలని ఆ దిశగా రైతులకు ఎంత యూరియా అవసరమో అంతవరకు మాత్రమే వారికి అందించాలని ఆయన తెలిపారు. యూరియాను ఇతర ప్రాంతాలకు ఎగుమతి కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లాలో యూరియా వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని పెంచే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఏ ఏ ఓ అన్నపూర్ణ, గుంటూరు జడ్పీ డిప్యూటీ సీఈవో కృష్ణ, టౌన్ డీఎస్పీ రామాంజనేయులు, ఇతర కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.