టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. వైసీపీ నేత సజ్జలకు మంగళగిరి పోలీసుల నోటీసులు

సజ్జలపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసుల జారీ నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు తాజాగా విచారణకు పిలుస్తూ నోటీసుల జారీ ఇప్పటికే పలువురు నేతల విచారణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు వైసీపీ కీలక నేతల మెడ చుట్టూ బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన పోలీసులు తాజాగా వైసీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీచేశారు. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ప్రమేయం కూడా ఉందని గుర్తించిన పోలీసులు ఆయన దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో నిన్న ఆయనను ఢిల్లీ విమానాశ్రయం పోలీసులు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఆయనకు నోటీసులు జారీచేశారు. 19 అక్టోబర్ 2021న వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. ఈ కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాంలను పోలీసులు ఇప్పటికే పలు దఫాలుగా పిలిచి, విచారించారు. కేసు కీలక దశలో ఉండడంతో దాడితో ప్రమేయం ఉన్న వైసీపీ ముఖ్య నేతలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే సజ్జలకు నోటీసులు జారీ చేశారు.