ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు తిరిగిరాదు!

అద్భుత ఖగోళ దృశ్యాలను వీక్షించేందుకు ఆసక్తిని కనబరిచే భారత ఔత్సాహికులకు గుడ్‌న్యూస్. మరో అరుదైన ఖగోళ దృశ్యం వినీలాకాశంలో కనువిందు చేస్తోంది. జనవరి 2023లో గుర్తించి సీ/2023 ఏ3 అనే తోకచుక్క (Tsuchinshan-ATLAS) ప్రస్తుతం భారత్ నుంచి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఔత్సాహికులు దీనిని సాధారణ కళ్లతో వీక్షించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే టెలిస్కోప్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని సూచించారు. సీ/2023 ఏ3 తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా చేరింది. ఆ రోజు నుంచి సూర్యుడికి దూరంగా కదులడం ప్రారంభించింది. అందుకే ప్రస్తుతం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తోకచుక్క అరుదైన ఖగోళ ఘట్టమని, మరో 80,000 సంవత్సరాల వరకు ఇది కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇదే అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క అని పేర్కొన్నారు. భారతదేశం అంతటా ఈ తోకచుక్క కనిపిస్తోంది. అక్టోబర్ 14-24 మధ్య ఇది మరింత ఎక్కువ స్పష్టంగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము సమయం ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచించారు. ఇక అక్టోబర్ 12 నుంచి ఈ తోకచుక్క సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిశలో కూడా కనిపిస్తోందని చెప్పారు.