* పాడైన కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చిన పోలీసులు.
* శివారు ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటు.
* మరో నెల రోజుల్లో పట్టణమంతా సీసీ కెమెరాల ఏర్పాటు ను పూర్తి చేస్తామని సీఐ వినోద్ కుమార్ స్వష్టీకరణ
నేరాల నియంత్రణకు పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానమే మేలని భావిస్తున్నారు. ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు.ఇందుకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. చెడిపోయిన సీసీ కెమెరాలకు మరమత్తులు చేయించి వినియోగంలోకి తెచ్చిన పోలీసులు అవసరమైన ప్రాంతాన్ని గుర్తించి కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
గత కృష్ణా పుష్కరాల సమయంలో మంగళగిరి పట్టణంలో మొత్తం సుమారు 76 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 52 మ్యాట్రిక్స్ కంపెనీకి చెందినవి కాగా, మిగిలిన 24 పురపాలక సంఘానికి చెందినవిగా తెలుస్తోంది. వీటిలో ఎక్కువ శాతం పని చేయకపోవడంతో పలు నేరాల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితులను గుర్తించటం కష్టతరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెడిపోయిన అన్ని సీసీ కెమెరాలకు పురపాలక సంఘ అధికారుల సహకారంతో ఇప్పటికే మరమ్మత్తులు చేయించారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఉన్న సీసీ టీవీ ద్వారా వాటి పనితీరు ను పట్టణ సీఐ వినోద్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. మంగళగిరిలోకి
ప్రవేశించే మార్గాలతో పాటు మంగళగిరి పట్టణం నుండి బయటకు వెళ్లే కూడళ్లలో సీసీ కెమెరాల ను వినియోగంలోకి తెచ్చామని సిఐ వినోద్ కుమార్ తెలిపారు. మిద్దె సెంటర్, గాలిగోపురం అంబేద్కర్ సెంటర్, తెనాలి ఫ్లై ఓవర్, కుప్పురావు కాలనీ, గౌతమ్ బుద్ధ రోడ్డు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రత్నాల చెరువులో ఓ దాత సహకారంతో త్వరలో 11 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మరో నెల రోజుల్లో పట్టణం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. అసాంఘిక శక్తులను అణచివేసేందుకు సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు.
మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు నగర పాలక సంస్థ అధికారుల సహకారంతో మంగళగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ వినోద్ కుమార్ తెలిపారు. తొలుత జామ్ జామ్ రెస్టారెంట్ వద్ద యూటర్న్ సదుపాయాన్ని కల్పించి రైల్వే స్టేషన్ కు చేరుకునేందుకు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు కూడా అవసరమని పలు ప్రదేశాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు వెంబడి ట్రాఫిక్ కు అవరోధం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆక్రమణలను తొలగిస్తామని అన్నారు.